25, జనవరి 2022, మంగళవారం

 అందుబాటులోకి మరో అర్బన్  ఫారెస్ట్ పార్క్


ప్రారంభించిన మంత్రులు కేటీఆర్,  ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, మ‌ల్లారెడ్డి 


హైదాబాద్, జ‌న‌వ‌రి 25: గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు మ‌రో అర్భ‌న్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం కుత్బుల్లాపూర్ మండలం గాజుల‌రామారంలో ప్రాణ‌వాయువు అర్భ‌న్ ఫారెస్ట్ పార్క్ ను ఐటీ, పుర‌పాల‌క  శాఖ మంత్రి కేటీఆర్, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి ప్రారంభించారు. 


ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా  న‌గ‌రాల‌కు, పట్టణాలకు దగ్గర్లో ఉండే రిజర్వ్‌ ఫారెస్ట్ ప్రాంతాల్లో అర్బన్ లంగ్‌ స్పేస్‌లుగా అర్భన్ ఫారెస్ట్ పార్క్ ల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు హైదరాబాద్‌కు నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు.  ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు, స్వ‌చ్చ‌మైన ప్రాణ‌వాయువును అందించేందుకు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు దోహదం చేస్తాయని  తెలిపారు. 


గాజుల‌రామారం రిజర్వ్‌ ఫారెస్ట్ బ్లాక్ లోని 454 ఎక‌రాల విస్తీర్ణంలో  రూ. 11.37 కోట్ల అంచనా వ్యయంతో ప్రాణ‌వాయువు అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ను స‌ర్వంగా సుంద‌రంగా తీర్చిదిద్దారు. ఎటు చూసినా పచ్చదనం కనిపించేలా  పెద్ద ఎత్తున మొక్క‌ల‌ను నాటారు. సంద‌ర్శ‌కుల‌ను అకట్టుకునేలా యోగా  షేడ్,  వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, గజీబో, ఆట‌విడుపు కోసం చిన్న పిల్ల‌లకు ప్ర‌త్యేక ఆట స్థ‌లం,  కుంటుంబంతో హాయిగా సేద‌తీరేలా పిక్నిక్ ఏరియా, నేచుర‌ల్ రాక్ సిట్టింగ్, త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను క‌ల్పించారు. సంద‌ర్శ‌కుల‌కు వినోదంతో పాటు విజ్ఞానం అందించేలా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, అడ‌వుల ప్రాధ‌న్య‌త గురించి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌త్యేకంగా ఒపెన్ క్లాస్ రూంల‌ను  ఏర్పాటు చేశారు.


ఈ కార్య‌క్ర‌మంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్,  అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ‌, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

 దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొన్నాళ్లుగా 3 లక్షలకు పైగా నమోదైన రోజువారీ కేసులు.. తాజాగా 2,55,874కి తగ్గాయి. అంటే నిన్నటితో పోలిస్తే 16 శాతం మేర కొత్త కేసులు క్షీణించాయి. 20 శాతం దాటిన రోజువారీ పాజిటివిటీ రేటు.. 15.52 శాతానికి పడిపోయింది. 16 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క కర్ణాటకలోనే 46 వేల కేసులుండగా.. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అయితే కొవిడ్ మృతుల సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. నిన్న 614 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 171 మరణాలు కేరళలో చోటు చేసుకొన్నవే. ఈ రెండేళ్ల కాలంలో 3.97 కోట్ల మందికి వైరస్ సోకగా.. 4.9 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

కేసుల కంటే రికవరీలే ఎక్కువ..

దేశంలో మూడో వేవ్‌కు ఒమిక్రాన్‌ ఆజ్యం పోయడంతో కొద్ది వారాలుగా కేసుల ఉద్ధృతి పెరిగింది. దాంతో రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్యే అధికంగా ఉండేది. కానీ, తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదుకావడం ఊరటనిస్తోంది. నిన్న 2,67,753 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.7 కోట్లు(93.15 శాతం)గా ఉన్నాయి. ప్రస్తుతం 22.3 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు 5.62 శాతంగా ఉంది.

నిన్న 62 లక్షల మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 162 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న టీనేజర్లకు తొలిడోసు, ముప్పు పొంచి ఉన్న వర్గాలకు ప్రికాషనరీ డోసు ఇస్తుండటం.. థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించిందని నిన్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు బాగా తగ్గుముఖం పడతాయని అంచనా వేశాయి.

 విశ్వనగరంగా తీర్చుకుంటున్న హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టీఆర్ఎస్ సర్కార్ తీర్చిదిద్దుతుందని మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇందులో భాగంగానే మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తున్నామన్నారు. రోజు రోజుకీ హైదరాబాద్ విస్తరణ పెరుగుతుందన్న మంత్రి.. మరో 30 ఏళ్లల్లో ఎన్నో కిలోమీటర్ల మేరకు పెరుగుతుందన్నారు. ఇందుకు తగ్గట్టు రోడ్లు, భవనాల విస్తరణ జరగాల్సి ఉందన్నారు మంత్రి కేటీఆర్. శివారు గ్రామాలన్నీ మున్సిపాలిటీగా మారాయని, ఇందుకు తగ్గట్టుగా పట్టణ ప్రణాళిక అవసరమన్నారు. ఒకప్పుడు తాగేందుకు నీరు దొరక్క ఇబ్బందిపడ్డ నగరవాసుల కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు ఇంటికి మంచినీటిని అందిస్తున్నామన్నారు.

హైదరాబాద్ మహానగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రూ. 138 కోట్ల వ్యయంతో చేపట్టిన బాచూపల్లి రోడ్డు విస్తరణ పనులకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో భాగంగా బాచూపల్లి నుంచి ఓఆర్ఆర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, నిజాంపేట మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీలు శంభి పూర్ రాజు, సురభి వాణి దేవి తదితరులు పాల్గొన్నారు.

Bhatti allegations on police: రాష్ట్ర పాలనలో అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ భట్టి నేతృత్వంలో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. శాంతిభద్రతలు, పోలీస్‌ వ్యవస్థపై సమీక్షించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. పోలీసులు ఒత్తిళ్లకు లొంగి నిస్సహాయంగా మారితే ప్రజలకు రక్షణ ఉండదని భట్టి అన్నారు. పోలీసుల నుంచి రక్షణ ఉంటుందనే భావన పోయిందని... పోలీసుల నిస్సహాయతను అర్థం చేసుకున్నామని విమర్శించారు. పోలీసులు పోలీసుల్లాగా పనిచేయాలని కోరుతున్నామని వ్యాఖ్యానించారు. వారు ఒత్తిళ్లకు లొంగితే ప్రజలకు రక్షణ ఉండదని అన్నారు.